సుందరకాండం
మహా బలసంపన్నుడైన మారుతీ రామ కార్యాన్ని పూర్తిచేయడానికి ఒక్క ఉదుటున లంఘించి సముద్ర మార్గాన్ని పట్టాడు. మారుతికి ఒకింతసేపు సేదదీర్చడానికై సముద్రంలో ఉన్న మైనాకుడనే పర్వతం ఒక్కసారిగా పైకి లేచింది.అది ఆటంకమేమోనని భావించిన హనుమంతుడు దాన్ని నెట్టివేశాడు.తర్వాత విషయాన్నీ గ్రహించి, ఆతిథ్యాన్ని స్వీకరించినట్లుగానే భావించామని తెలిపి కర్తవ్యోన్ముఖుడైనాడు. మధ్యలో 'సురస' అనే నాగమాత ఆయనను పరీక్షించి ఆశీర్వదించింది. సింహిక అనే రాక్షసి మారుతిని చంపేందుకు యత్నించి ప్రాణాలు కోల్పోతుంది.
చివరకు, త్రికూట పర్వతంపై ఉన్న శ్రతు దుర్బేధ్యమైన లంకను చేరుకున్నాడు హనుమ.రాత్రి కాగానే తన శరీరాన్ని మరుగుజ్జుగా కుదించుకుని, లంకలోకి వెళ్లేందుకు యత్నించగా లంకాధిదేవత 'లంకిణి' అడ్డగించింది. హనుమ దెబ్బకు కుప్పకూలి లంకకు వెళ్ళడానికి దరి ఇచ్చింది.
వెళ్ళేది రాక్షసుల కోటలోకి కాబట్టి ఎడమ కాలు ముందుపెట్టి కోట ప్రకారంనుండి దూకి వెళ్ళాడు మారుతీ.సౌందర్యంతో వెలిగిపోతున్న మండోదరితో సహా ఎందరినో చూశాడు.ఎంత వెతికినా, సీత జడ కనిపించకపోయేసరికి మరణానికి సిద్దమయ్యాడు మారుతీ.చివరి ప్రయత్నాంగా అశోక వనంలోకి ప్రవేశించాడు.ఎత్తైన శింశుపా వృక్షం. ఎక్కిచూడగా రాక్షస స్త్రీల మధ్య కృశించిన సీత కనిపించింది.చెట్టుపై అలాగే నిరీక్షించాడు హనుమ.
ప్రభాత సమయంలో వచ్చిన రావణుడి తేజస్సును చూసి ఆశ్చర్యపోయాడు మారుతీ. ఎన్నో విధాలుగా సీతను ఒప్పించే ప్రయత్నాలు చేశాడు రావణుడు. సీత రామునితో వైరం మంచిది కాదని హెచ్చరించింది. నెలరోజుల గడువు విధించి వెళతాడు రావణుడు.విభీషణుడి కుమార్తె త్రిజట సీతను తన స్వప్న వృత్తాంతం చెప్పి ఓదారుస్తుంది.బాధలో ఉన్న సీత తనను విశ్వసించేందుకు రామ కథ గానాన్ని ప్రారంభిస్తాడు హనుమ.సీత పిలవగానే, జరిగిన వృత్తాంతాన్నంతా చెప్పి రాముడు గుర్తుగా పంపిన ముద్రికను సీతకు అందించి నమస్కరిస్తాడు.సీతను తాను రాముని వద్దకు చేరుస్తానని హనుమ తెలపగా, రావణుడిని సంహరించి తనను తీసుకువెళ్లడమే శ్రీరాముని స్థాయికి సరిపోయేదని తెలుపుతుంది సీత. హనుమంతునికి కాకాసురుడనే రాక్షసుని వృత్తాంతాన్ని తెలుపుతుంది.అది రామునికి, సీతకు మాత్రమే తెలిసిన రహస్యం. ఈ వృత్తాంతాన్ని చెప్పడంతో బాటుగా తన చూడామణిని గుర్తుగా శ్రీరామునికి, పంపింది జానకి. సీత దర్శనం ముగిసింది.ఇక శత్రు సైన్యాల బలాబలాలను కూడా తెలుసుకోవాలనుకున్నాడు హనుమంతుడు.అందుకు అశోక వనాన్ని ధ్వంసం చేయడానికి పూనుకున్నాడు.అడ్డువచ్చిన రాక్షసులను సంహరించాడు. చివరకు ఇంద్రజిత్తు బ్రహ్మస్త్రంతో బందించబడ్డాడు. రావణుని సభలోకి హనుమంతుడిని ప్రవేశపెట్టారు. అక్కడ రాముని శౌర్యాన్ని గురించి రావణునికి వివరించాడు హనుమ. రావణుడు కోపంతో హనుమంతుడిని విధించామని తెలిపితే, దూతగా వచ్చినవారిని వధించవద్దని అడ్డుకుంటాడు విభీషణుడు. దీనితో హనుమంతుని తోకను నిప్పుపెడతారు.దానితో లంక దహనం చేస్తాడు మారుతీ.చూసి రమ్మంటే కాల్చి రావడం అంటే ఇదే. అంతలోనే తను చేసిన పొరపాటు తెలియవస్తుంది మారుతికి.సీతమ్మ వారు ఉండే లంకని కాల్చాడు. సీతాదేవి మరణిస్తే రాముని సంగతి ఏంకావాలని దుఃఖించాడు. అంతలోనే సీతాదేవి కూర్చున్న ప్రదేశం మినహా మిగతా లంక అంత అగ్నికి ఆహుతి అయినట్టుగా తెలుసుకొని సంతోషిస్తాడు.సీతాదేవికి పాదాభివందనం చేసి మల్లి తిరుగు ప్రయాణమైనాడు. 'అరిష్టం' అనే పర్వతాన్ని ఎక్కి సముద్ర లంఘనం చేశాడు. దారిలో మైనాకుడిని ఆప్యాయంగా స్పృశించాడు.మహేంద్రగిరి శిఖరం పైకి చేరి,సీతమ్మ జాడను తెలుసుకున్నానని ప్రకటించాడు. అందరు ఉత్సహంతో కిష్కింధ చేరి అక్కడి మధువనాన్ని చేరారు. ఉత్సహంతో దానిని ధ్వంసం చేశారు.చివరకు హనుమ సీతాదేవి ఇచ్చిన చూడామణిని సమర్పించి, సీతాదేవి జాడను రామునికి విన్నవించాడు హనుమ.
0 Doubts's